: మంచి మనసు గల క్రిష్.. అభినందించిన బాలయ్య
మంచి మనసు గల దర్శకుడు క్రిష్ చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. 63వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కంచె’కు అవార్డు రూపేణా వచ్చిన నగదు బహుమానాన్ని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి క్రిష్ విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా క్రిష్ ను అభినందిస్తూ బాలయ్య ఒక ట్వీట్ చేశారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళం ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం గురించి బాలయ్య ప్రస్తావించారు. ఈ ట్వీట్ తో పాటు క్రిష్ ను అభినందిస్తున్న ఒక ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.