: ఆంధ్రప్రజలు ఏం తప్పు చేశారు..?: ‘హోదా’ ప్రకటనపై మండిపడ్డ బొండా ఉమా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదంటూ నిన్న పార్లమెంట్‌లో చేసిన ప్రకటన పట్ల టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రజలు పులకించిపోయారని.. కానీ, ఈరోజు కేంద్రం చెబుతోన్న మాటలకు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అండ తమకు పుష్కలంగా ఉంటుందని ఏపీ ప్రజలు నమ్మారని అన్నారు. ఏపీలో నేటి పరిణామాలు ఎలా ఉన్నాయో కేంద్రం గుర్తించాలని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. 'ఏపీకి పరిశ్రమలు లేవు, రెవెన్యూ లోటు ఉంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కేంద్రం 5 కోట్ల మంది ఏపీ ప్రజలకి నష్టాన్ని చేకూరుస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీ లోటు బడ్డెట్లో ఉందని, హోదాపై వెనకడుగు వేయొద్దని కోరారు.