: మన మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది.. అయినా కలిసి పోరాడేందుకు సిద్ధమే: అంబటి రాంబాబు
టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే.. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, శాసనసభలో లేని రాజకీయపార్టీలను కూడా పిలిచి సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు చంద్రబాబునాయుడు మార్గదర్శకంగా ఉండాలని, ఒక ఉద్యమరూపం తీసుకురావాలని కోరారు. కేంద్రంలో టీడీపీ మంత్రులను, ఏపీలో బీజేపీ మంత్రులను కొనసాగిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాడతామంటే కుదరదని, ఈ పద్ధతేంటో తనకు అర్థం కావట్లేదని రాంబాబు విమర్శించారు.