: పాలేరు ప్రజలకు సుచరితా రెడ్డి బహిరంగ లేఖ!
పాలేరు ప్రజలనుద్దేశించి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి చేస్తున్న ఖర్చును వందేళ్లైనా తాము సంపాదించలేమని ఆమె స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆమె నిలదీశారు. ప్రజలు కాస్త ఆలోచించాలని ఆమె కోరారు. పాలేరు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజాస్వామ్య భవిష్యత్ ను నిర్దేశిస్తుందని ఆమె తెలిపారు. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊబిలో కూరుకుపోవడం ఖాయమని ఆమె హెచ్చరించారు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి, ప్రజలంతా తమ వాళ్లేనని తరతమ భేదాలు లేకుండా చూసుకున్న తమకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, టీఆర్ఎస్ పాలనలో ఇక ముందుముందు ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా? అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని రోజుకో కొత్త నాటకంతో మభ్యపెట్టడాన్ని ప్రజలు గుర్తించాలని ఆమె సూచించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఆశయాల సాధనకు, ఆయన ఆశీస్సులతో, మీ ఆదరాభిమానాల కోసం పోటీలో నిలబడ్డ మీ ఆడబిడ్డనని ఆమె లేఖను పూర్తి చేశారు.