: మోదీ కేబినెట్ నుంచి బయటకు పారికర్!... తిరిగి గోవా సీఎంగా బాధ్యతలు?
బీజేపీ గోవా శాఖలో ఎదురులేని నేతగా ఎదిగిన రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్... ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడు. పారికర్ పనితీరుకు ఫిదా అయిన మోదీ... ఆయనతో ఏకంగా గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ తన కేబినెట్ లో చేర్చుకున్నారు. కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. పారికర్ కూడా మోదీ నమ్మకాన్ని నిలుపుకున్నారు. రక్షణ శాఖలో పలు కీలక నిర్ణయాలు అమలు జరుగుతున్న తరుణంలో పారికర్ తనదైన శైలిలో ఎలాంటి వివాదాలు లేకుండానే ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈలోగానే ఏమైందో, ఏమో తెలియదు కాని... మోదీ కేబినెట్ నుంచి పారికర్ బయటకు వచ్చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మోదీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేయడంతో పాటు తిరిగి గోవా సీఎంగా పారికర్ పదవీ బాధ్యతలు చేపడతారని అటు గోవాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లు నిజమేనన్నట్లు పారికర్ కూడా మొన్న (ఆదివారం) గోవాలోని బిచోలిమ్ లో ఓ వెబ్ సైట్ తో మాట్లాడిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అవును. మూడు నాలుగు నెలల్లో తిరిగి గోవాకు వచ్చేస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. పారికర్ రీ ఎంట్రీని గోవా బీజేపీ శాఖ స్వాగతిస్తున్నా... అసలు పారికర్ బ్యాక్ స్టెప్ కు కారణమేంటన్న విషయం తెలియడం లేదు.