: కోఠీ మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్యం అందక గర్భిణి మృతి.. కడుపులోనే మరణించిన శిశువు.. ఉద్రిక్తత
హైదరాబాదులోని కోఠీ మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో వైద్యం అందక మమత అనే గర్భిణి మృతి చెందింది. మమత కడుపులోనే శిశువు మరణించింది. దీంతో ఆమె బంధువులు, స్థానికులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చిన మమతను రెండు రోజుల తరువాత రమ్మని వైద్యులు సూచించారు. గర్భిణి అయిన మమతకు తీవ్ర నొప్పులు రావడంతో నిన్న ఆసుపత్రికి వచ్చింది. అయితే సకాలంలో చికిత్స అందించకపోవడంతో మమత చనిపోయినట్లు తెలుస్తోంది. నొప్పులతో వచ్చిన మమత పట్ల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నొప్పులతో వచ్చిన మమత, ఆమె కడుపులోని శిశువు చనిపోవడంతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలముకున్నాయి. గర్భిణి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రి ప్రాంగణంలో ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం వచ్చి గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ప్రతీ పనికి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.