: వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!... కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడమే కారణమట!
వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట ఎంపీ), ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డిలపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కాంట్రాక్టర్ శరత్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఆదేశాలతో తాను ఓ పని చేశానని చెప్పిన శరత్ చంద్ర... అందుకైన బిల్లులు రూ.32 లక్షలను వారు తనకివ్వలేదని ఆరోపించారు. ఇదే ఆరోపణతో శరత్ చంద్ర నిన్న కడపలోని వైసీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలతో బయటపడ్డ శరత్ చంద్ర నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.