: విడివిడిగా, కలివిడిగా!... భూమా, శిల్పాల మధ్య రాజీ చర్చలు కంటిన్యూస్!
టీడీపీ కర్నూలు జిల్లా శాఖలో నెలకొన్న విభేదాలు దాదాపుగా సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి. అయితే ఈ దిశగా నిన్న ప్రారంభమైన చర్చలు ఇంకా ముగియలేదు. నేడు కూడా కొనసాగనున్నాయి. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి పిలుపుతో టీడీపీ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే), శిల్పా మోహన్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే), శిల్పా సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తదితరులు మొన్న రాత్రే విజయవాడకు బయలుదేరారు. చంద్రబాబు డైరెక్షన్ లో పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, జిల్లా ఇన్ చార్జీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు నిన్న రంగంలోకి దిగారు. భూమా, శిల్పా బ్రదర్స్ తో వారు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భూమా, శిల్పా వర్గాలు... ఎవరి వాదనలు వారు వినిపించారు. ఆ తర్వాత ఇరువర్గాలను ఒకే చోట కూర్చోబెట్టి మరోమారు చర్చలు జరిపారు. ఈ దఫా ఇరువర్గాలు కాస్తంత బెట్టు వీడినా... పూర్తిగా కలిసి పనిచేసే విషయంలో మాత్రం మొండికేశాయి. ఇదే విషయాన్ని కళా, అచ్చెన్నలు... చంద్రబాబుకు వివరించారు. చర్చల పురోగతిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు... నేటి ఉదయం రెండు వర్గాలతో తాను మాట్లాడనున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని రెండు వర్గాలకు వివరించిన కళా... నేడు కూడా విజయవాడలోనే ఉండాలని సూచించారు. దీంతో నిన్న రాత్రి ఇరువర్గాలు కూడా బెజవాడలోనే బస చేశాయి. నేడు మరోమారు ఈ వర్గాలు చంద్రబాబుతో భేటీ కానున్నాయి. ఈ క్రమంలో నిన్నటి చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన భూమా నాగిరెడ్డి కాస్తంత తగ్గి మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తమ రెండు వర్గాల మధ్య వ్యక్తిగత సమస్యలేమీ లేవని కూడా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మార్గదర్శనంలో కలిసి నడిచేందుకు సిద్ధమేనని ఆయన చెప్పారు. తమ తండ్రులు, తాతల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులతో పాటు వర్గాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక శిల్పా వర్గం నుంచి కూడా మీడియాతో మాట్లాడిన చక్రపాణిరెడ్డి... చర్చల్లో పురోగతి ఉందని పేర్కొన్నారు. మరోమారు చంద్రబాబు జరిపే చర్చల్లో పూర్తి స్థాయి ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.