: బాబుతో భేటీకి విజయవాడ చేరుకున్న శిల్పా బ్రదర్స్, భూమా కుటుంబం
కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో జిల్లా ముఖ్యనేతలు శిల్పా బ్రదర్స్, భూమా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి, అతని సోదరుడు చక్రపాణిరెడ్డి, భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్ద కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తమ విభేదాలతో పార్టీకి చేటు చేయవద్దని, ఇరు వర్గాలు కలిసి పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించి మసలుకోవాలని కాంగ్రెస్ నుంచి శిల్పా సోదరులు, వైఎస్సార్సీపి నుంచి భూమా కుటుంబం టీడీపీలో చేరిననాడే పార్టీ అధినేత చంద్రబాబు ఇరు వర్గాలకు సూచించారు. అయినప్పటికీ వీరి మధ్య విభేదాలు తగ్గకపోవడంతో, పరస్పర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఒకరిపై మరొకరు సీఎంకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో వీరి పంచాయతీ చంద్రబాబు సమక్షానికి చేరింది. ఆయన ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.