: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ... ఎన్నికల 'టెక్' ఎక్స్ పర్ట్ ప్రశాంత్ కిషోర్ అండతో యూపీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి!
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించి, ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన టెక్నాలజీ చతురతతో, నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేరుకోవడానికి, ఆపై బీహార్ లో నితీశ్ కుమార్ పీఠాన్ని అధిరోహించడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్, తాజాగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రచార పర్యవేక్షణ స్వయంగా జరిపేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు అంగీకరించని పక్షంలో, యూపీకి చెందిన ఓ బ్రాహ్మణ వ్యక్తిని ఎంచుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపి, రాహుల్ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీని ఎన్నికలను ఎదుర్కొనేలా చూడాలన్నది కాంగ్రెస్ అభిమతంగా సమాచారం. ఒకప్పుడు యూపీలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలనూ దక్కించుకుని సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ పడేందుకు కూడా సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు తమ సంప్రదాయ నియోజకవర్గాలైన రాయ్ బరేలీ, అమేథీల్లో గెలువగా, మరే నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా, పార్టీలో సంస్థాగత పరమైన మార్పుచేర్పులు పూర్తి చేసి, కొత్త నేత సారథ్యంలో ముందుకు దూకాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్ యాదవ్, మాయావతి తదితరుల పార్టీలకు ఎలాంటి పోటీని ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎటువంటి ఫలితాలు వెల్లడవుతాయో చూసిన తరువాత యూపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.