: జగన్ ‘జనహోరు’ చూసి తగ్గిన ఖాకీలు!... అనుమతి లేకున్నా ర్యాలీని అడ్డుకోని వైనం!
గుంటూరు జిల్లా మాచర్లలో హైటెన్షన్ తప్పదన్న వాదనను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన ‘జనహోరు’తో తిప్పికొట్టారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురుకాకుండానే తన ‘పోరు బాట’ను ముగించారు. కరవుపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన ‘పోరుబాట’లో భాగంగా ఆ పార్టీ అధినేతగా గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన నిరసనకు జగన్ హాజరయ్యారు. నేటి ఉదయం రోడ్డు మార్గం మీదుగా హైదరాబాదు నుంచి బయలుదేరిన జగన్... కొద్దిసేపటి క్రితం మాచర్ల చేరుకున్నారు. పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న జగన్... తనకు మద్దతుగా ర్యాలీకి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అయితే జగన్ ర్యాలీకి, నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు... దాదాపుగా ర్యాలీని అడ్డుకునేందుకే సమాయత్తమయ్యారు. జగన్ అక్కడికి చేరుకునేసరికే పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. అయితే ఇవేమీ పట్టించుకోని జగన్... ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ నిరసనకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో మాచర్ల జనసంద్రంగా మారింది. ఈ జనసంద్రం మధ్య ర్యాలీని అడ్డుకోవడం దుర్లభమేనన్న భావనతో పోలీసులు మిన్నకుండిపోయారు. దీంతో అక్కడ ఏమాత్రం ఉద్రిక్తత లేకుండానే జగన్ నిరసన ప్రదర్శన ముగిసింది.