: అన్నా, మీకో దండం!... పార్టీ వీడుతున్నట్లు జగన్ కు ముఖం మీదే చెప్పేసిన పొంగులేటి
తెలంగాణలో వైసీపీకి అడ్రెస్ గల్లంతు ఇక లాంఛనమే. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన జగన్ కు ముఖం మీదే చెప్పేశారు. వెనువెంటనే బయటకు వచ్చేసిన పొంగులేటి నేరుగా తన సొంతూరు ఖమ్మంకు బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మంలో పొంగులేటి తన ముఖ్యఅనుచరులతో భేటీ కానున్నారు. ఈ భేటీ ముగిసిన మరుక్షణమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించే అవకాశాలున్నాయి. పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత పాయం వెంకటేశ్వర్లు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. పాయం కూడా పొంగులేటి వెంటే టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నారు.