: 154 పరుగులకే కుప్పకూలిన పంజాబ్...గుజరాత్ బౌలర్లు అదుర్స్
ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న 28వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ బ్యాట్స్ మన్ గౌరవప్రదమైన స్కోరు సాధించినప్పటికీ 154 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. ఆద్యంతం పంజాబ్ బ్యాట్స్ మన్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ గుజరాత్ బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మురళీ విజయ్ (55), స్టోయిన్స్ (27) శుభారంభం ఇచ్చారు. అయితే షాన్ మార్ష్ (1), మ్యాక్స్ వెల్ (0), గురుకీరత్ సింగ్ (0) వరుసగా విఫలమవడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31) ఆచి తూచి ఆడగా, సాహా (33) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. భారీ షాట్ కు యత్నించే క్రమంలో మిల్లర్ పెవిలియన్ చేరగా, అక్షర్ పటేల్ (0), తరువాత సాహా కూడా వెనుదిరిగాడు. అనంతరం మోహిత్ శర్మ (1), కరియప్ప (1) వరుసగా పెవిలియన్ చేరారు. ఒక బంతి మిగిలి ఉండగానే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆలౌట్ అయిన పంజాబ్ జట్టు 154 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కౌశిక్ 3 వికెట్లతో రాణించగా, బ్రావో, ప్రవీణ్ కుమార్ చెరి రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, జడేజా, కులకర్ణి చెరి ఒక వికెట్ తీశారు. 155 పరుగులతో గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభించింది.