: నిరసనకారుల వశమైన ఇరాక్ పార్లమెంట్... బాగ్దాద్ లో అత్యయిక స్థితి!
ఓవైపు ఉగ్రవాదుల కార్యకలాపాలతో అల్లాడుతున్న ఇరాక్ లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరమైంది. నిరసనకారులు రాజధాని బాగ్దాద్ లోని పార్లమెంటును తమ అధీనంలోకి తీసుకోవడంతో అత్యయిక స్థితిని విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బాగ్దాద్ లో గ్రీన్ జోన్ గా, అమెరికన్ ఎంబసీ సహా మరెన్నో కీలక భవంతులు ఉన్న ప్రాంతంలోకి దూసుకొచ్చిన నిరసన కారులు, ప్రభుత్వ మార్పును డిమాండ్ చేస్తూ, పార్లమెంట్ లోకి జొరబడుతున్న దృశ్యాలను ఇరాక్ టెలివిజన్ చానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. తమకు కనిపించిన కొందరు ప్రజాప్రతినిధులను ఆందోళనకారులు చావ గొట్టారు. పార్లమెంట్ ఆవరణలో కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ప్రాణభయంతో పార్లమెంట్ లోని గదుల్లో తలుపులు బిడాయించుకుని బిక్కుబిక్కుమంటుండటంతో, వారిని విడిపించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. నిరసనకారులతో చర్చిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాజధానికి వచ్చే అన్ని రహదారులనూ నిలిపివేశామని సైన్యాధికారి ఒకరు తెలిపారు. కాగా, షియా ముస్లిం నేత ముఖ్తాద్ అల్ సదర్ నేతృత్వంలో ప్రభుత్వ మార్పు కోరుతూ, ప్రజలు చాలా కాలంగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. గత 13 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, ఇరాక్ చరిత్రలో ఇక శకం మొదలైందని పార్లమెంటును ఆక్రమించుకున్న అనంతరం నిరసనకారులు నినాదాలు చేశారు.