: కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు త్వరలోనే బయటకు వచ్చేస్తారు: ఎమ్మెల్యే జలీల్ ఖాన్
కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు కేబినెట్ నుంచి త్వరలోనే బయటకు వచ్చేస్తారని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితం అవడం ఖాయమని, కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన అన్యాయానికి పుట్టగతులుండవని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ కు రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియవని, తనపై రాసుకున్న అవినీతి పుస్తకంలో పొరపాటున చంద్రబాబు పేరు రాసుకున్నట్టుగా ఉందని ఆయన విమర్శించారు. రాయచోటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా త్వరలో టీడీపీలో చేరబోతున్నారని జలీల్ ఖాన్ అన్నారు.