: గంటా ఇలాకాలోనూ వైసీపీ ఖాళీ!... విశాఖ జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ!


ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 16 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి ఝలక్కిచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. విశాఖ జిల్లా విషయానికి వస్తే... మొన్ననే ఆ జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కేశారు. తనతో పాటు నియోజకవర్గంలో వైసీపీ తరఫున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న వారంతా టీడీపీలోకి చేరారు. వెరసి అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయింది. తాజాగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఖాళీ కానుంది. నేడు విశాఖ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు సమక్షంలో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలంతా టీడీపీలో చేరనున్నారు. భీమిలి మునిసిపాలిటి మాజీ చైర్మన్ శైలేందర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ స్థానిక నేతలంతా సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అక్కడి ఆనందపురంలో భారీ ఏర్పాట్లు జరిగాయి.

  • Loading...

More Telugu News