: ‘ఆధార్ కార్డు’ పధ్ధతిపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తి.. మిగతా దేశాల్లోనూ అమలు చేయాలని యోచన
భారత్‌లో అమలులో ఉన్న ఆధార్ కార్డు పధ్ధతిపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తిని కనబరిచింది. అసలైన అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆధార్‌ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ నెంబర్‌ను జత చేయాలని సూచిస్తూ ప్రచారం చేస్తోన్న విషయం విధితమే. ఆధార్ విధానంపై యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచాలకులు జనరల్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే ప్రపంచ బ్యాంక్ అధికారులకు వివరించారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. అధిక జనాభాగల భారత్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆధార్‌లో వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించడానికి అధికారులు తీసుకొన్న శ్రమ సత్ఫలితాలిస్తోందన్నారు. ఇతర దేశాల్లోనూ మన ఆధార్ ప్రక్రియను అమలు చేయాలని ప్రపంచ బ్యాంక్ భావిస్తోందని ప్రపంచ బ్యాంక్ అధికారులకు ఆధార్ వివరాలను అందించిన అనంతరం అజయ్ భూషణ్ మీడియాతో తెలిపారు. క్రమక్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాల్లో అమలు చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఆసక్తిగా ఉందని తెలిపారు.