: పెద్దలకు 'ట్వీట్'టర్... విద్యార్థులకు మార్గదర్శి!
ప్రముఖ సోషల్‌మీడియా వెబ్సైట్ ట్విట్టర్‌లోని ఫీచర్స్ నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ప్రత్యేకించి సెలబ్రిటీలకు ప్రచార వేదికగా ఉపయోగపడుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు కూడా ట్విట్టర్ వేదికనే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే వీరికే కాదు.. ఈ సామాజిక వెబ్‌సైట్‌ను విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవడం వల్ల అది వారికి ఓ మార్గదర్శిలా, టీచర్ లా వ్యవహరిస్తుందని అమెరికా వెర్మోంట్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకులు స్కూల్ విద్యార్థులపై చేసిన పరిశోధనల్లో ఈ అంశాన్ని గుర్తించారు. విద్యార్థులు తాము భవిష్యత్తులో రాణించాలనుకుంటోన్న రంగంపై ఇన్ఫర్మేషన్ను సంపాదించుకోవడం కోసం ట్విట్టర్‌ను చక్కని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకొని కొనసాగించిన ఈ పరిశోధనలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధనల్లో పాల్గొన్న 95శాతం మంది విద్యార్థులు ట్విట్టర్‌ను తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమైంది. ట్విట్టర్ ద్వారా తమకు ఇష్టమైన నిపుణులు, సెలబ్రిటీలు, పలు రంగాల్లో రాణించిన వారితో తాము చర్చిస్తున్నట్లు, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు.