: నెల్లూరులో సరికొత్త చలివేంద్రం!... తాటిముంజల పంపిణీని ప్రారంభించిన టీడీపీ నేత
వేసవి వచ్చిందంటే చాలు... పలు స్వచ్ఛంద సంస్థలు తమ సేవాతత్పరతను చాటుకుంటూ జనానికి చల్లటి నీటిని ఉచితంగా అందించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మనం చూస్తున్నదే. చిన్న గుడారాల్లాంటి షెడ్లు వేసి అందులో పెద్ద పెద్ద మట్టి కుండలను పెట్టి, వాటిలో తాగు నీటిని పోసి కూల్ వాటర్ ను జనానికి అందిస్తుంటాయి. అయితే నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు... నిన్న నెల్లూరులో సరికొత్త చలివేంద్రాన్ని ఓపెన్ చేశారు. రొటీన్ కు భిన్నంగా... నీటికి బదులుగా తాటిముంజలను జనానికి ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తాను ప్రారంభించిన చలివేంద్రం మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరిని పిలిచి మరీ ఆయన ముంజలను అందించి వేసవి తాపాన్ని చల్లార్చే యత్నం చేశారు.