: చంద్రబాబులా మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని మేము ఎన్నికల్లోకి వెళ్లలేదు: ఎమ్మెల్యే రోజా
చంద్రబాబులా మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని తాము గత ఎన్నికల్లోకి వెళ్లలేదని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ, తమపై అధికార టీడీపీ విమర్శలు గుప్పిస్తోందని అన్నారు. తమ అధినేత జగన్ ఏ తప్పూ చేయలేదని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉన్నామని అన్నారు. ప్రజలను నమ్ముకొనే గత ఎన్నికల్లో పోటీ చేశామని, చంద్రబాబు నాయుడిలా మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని ఎన్నికల బరిలోకి దిగలేదని ఉద్ఘాటించారు. అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఏపీ సీఎంపై రోజా మండిపడ్డారు. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం అని టీడీపీ నేతలు అంటున్నారని.. ‘మీరు దొంగలు, ముద్దాయిలు. మీరు చర్చకు రమ్మనడమేంటీ?’ అని ఆమె మండిపడ్డారు. సీబీఐ ఎంక్వైరీకి చంద్రబాబు సిద్ధమా? అని సవాలు విసిరారు. ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏం నెరవేర్చారని, విభజన చట్టంలో హామీలు ఎందుకు అమలు కావట్లేదని రోజా ప్రశ్నించారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రైతుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను గురించి మాట్లాడుతూ... పసుపు కండువాలు కప్పుకున్న తమ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్నారన్నారు. 'తెలంగాణలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అందరికీ తెలుసు' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.