: వైఎస్ జగన్ అధికారంలోకి రావాలంటే!... పరిస్థితులు ఇలా ఉండాలంటున్న మైసూరా!
‘మరో ఏడాదో, రెండేళ్లు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. మీ కష్టాలు తీరతాయి’... పలు సందర్భాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. ఇప్పట్లో అయితే ఆయన మాటలు సత్యదూరమనే చెప్పొచ్చు. గడచిన ఎన్నికల్లో టీడీపీకి సంపూర్ణ మెజారిటీ రాగా... ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా వైసీపీ టికెట్లపై విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో అటు టీడీపీ బలం పెరుగుతుండగా, ఇటు వైసీపీ బలం క్రమంగా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలు వచ్చేదాకా జగన్ కు అధికారం అందడం దుర్లభమే. అయితే వచ్చే ఎన్నికల్లోనైనా జగన్ అధికారంలోకి వస్తారా? అంటే... నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ రాజకీయవేత్త మైసూరా రెడ్డి... జగన్ కు అధికారం అందడం దాదాపుగా అసాధ్యమేనని తేల్చేశారు. ఒకవేళ జగన్ అధికారంలోకి రావాలంటే... పరిస్థితులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆయన కాస్తంత విపులంగానే చెప్పారు. మైసూరా అంచనా ప్రకారం... అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలం కావాలి. అదే సమయంలో రాజకీయంగా ఇతర పక్షాలు బలీయం కావాలి. ఇలాంటి పరిస్థితులు లేకపోతే... జగన్ అధికారంంలోకి రావడం కలేనని మైసూరా తేల్చేశారు.