: టిఫిన్ కు పిలిచి కండువా కప్పేశారు!... జగన్ పై మైసూరా సంచలన వ్యాఖ్య
వైసీపీకి రాజీనామా చేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా నేపథ్యంలో నిన్న ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన... వైసీపీలో తన చేరికపై సరికొత్త వ్యాఖ్యలు చేశారు. అసలు తనకు వైసీపీలో చేరే ఉద్దేశమే లేదన్న రీతిలో మైసూరా చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపుతున్నాయి. అప్పటికే తనను పార్టీలోకి చేర్చుకునే విషయానికి సంబంధించి జగన్ మధ్యవర్తులను రంగంలోకి దించారని మైసూరా చెప్పారు. అయినా ఈ వయసులో పార్టీ మారి చెడ్డపేరు తెచ్చుకోవడమెందుకన్న రీతిలో తాను ఉండగా, పార్టీ మారకున్నా... జగన్ తో కలిసి టిఫిన్ చేస్తే పోయేదేముందంటూ తనను మధ్యవర్తులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో జగన్ ఇంటికి టిఫిన్ కని వెళ్లగా... అప్పటికప్పుడు తన అనుమతి లేకుండా, తన ప్రమేయం లేకుండానే తన మెడలో పార్టీ కండువా వేశారని మైసూరా చెప్పారు. ఈ చర్యతో తాను అయోమయంలో ఉండగానే, సదరు వార్త టీవీల్లో స్క్రోలింగ్ కావడం... టీడీపీ తనను సస్పెండ్ చేయడం జరిగిపోయాయని తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని కూడా మైసూరా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, మంచి ప్రాధాన్యం ఇస్తామని జగన్ మధ్యవర్తుల ద్వారా చెప్పించారన్నారు. రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పించే దిశగా చర్యలు చేపడతామని కూడా జగన్ వారితో పేర్కొన్నట్లుగా మైసూరా చెప్పారు. అయితే ఆ తర్వాత తనకు పార్టీలో అసలు విలువే ఇవ్వలేదని, సీనియర్లకు విలువ ఇచ్చే అలవాటే జగన్ లో లేదని కూడా మైసూరా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను చేరిన వైనాన్ని మైసూరా తన రాజీనామా లేఖలోనూ జగన్ కు వివరించారు.