: కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు.. చేతల ముఖ్యమంత్రి!: కేటీఆర్
‘కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి’ అని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తోన్న ప్లీనరీలో మునిసిపల్ పాలనపై తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కేసీఆర్ కేవలం మాటలు చెప్పి విడిచే ముఖ్యమంత్రి కాదని చేతల్లో చూపిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ రాబోతుందని చెప్పారు. దేశంలోనే వినూత్న పారిశ్రామిక విధానాన్ని తెచ్చామని కేటీఆర్ చెప్పారు. దళిత, గిరిజిన, మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ పారిశ్రామిక విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. టీఆర్ఎస్ హైదరాబాదీయుల మనసును గెలుచుకుందని వ్యాఖ్యానించారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.20వేల కోట్లతో హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధిని చేపట్టామన్నారు.