: కరవుతో ప్రజలు అల్లాడుతుంటే.. మరో పక్క టీఆర్ఎస్ సంబరాలా..?: ఉత్తమ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరవు పరిస్థితులతో అల్లాడుతుంటే ఖమ్మం జిల్లాలో ప్లీనరీ పేరుతో ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌తో టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కరవు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ పక్క కరవుతో ప్రజలు అల్లాడుతుంటే.. మరో పక్క టీఆర్ఎస్ సంబరాలా..?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ కరవును నివారించడంలో లేదని విమర్శించారు. ‘కరవు నివారణకు ప్రభుత్వ చర్యలు శూన్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.