: మోదీతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భేటీ!... అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు కోసం వినతి
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పార్లమెంటులోనే మోదీని కలిసిన గీత పలు అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించారు. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్ విన్యాసాలను తిలకించేందుకు వచ్చిన సందర్భంగా ప్రధాని...విశాఖ మన్యంలోని గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీని టేస్ట్ చేసి మైమరచిపోయారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ప్రధానిని కలిసిన గీత... అరకు కాఫీ రుచిని ప్రధానికి గుర్తు చేశారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో సాగవుతున్న అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. గీత వినతికి సానుకూలంగా స్పందించిన మోదీ... సాధ్యమైన మేరకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.