: ఏడేళ్లలో చేయలేని పనిని ఏడాదిలో చేశామన్న హరీశ్... మేనల్లుడి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న కేసీఆర్
ఖమ్మంలోని చెరుకూరి తోటలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ కీలక నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆసక్తికర ప్రసంగం చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరందించే ప్రధాన కాల్వ నాగార్జున సాగర్ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏడేళ్లలో పూర్తి చేయలేని పనిని తాము ఏడాదిలో పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డిలతో కలిసి తాను... నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని సాగర్ కాలువ పనులను రెండు రోజులుగా పరిశీలించి పనుల్లో వేగాన్ని పెంచగలిగామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను దేశం యావత్తు ప్రశంసించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ కల అని కూడా ఆయన పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై తన మేనల్లుడు హరీశ్ రావు చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని కేసీఆర్ ఆసక్తిగా తిలకించడం కనిపించింది.