: ‘సాక్షి’ డైరెక్టర్లకు ఊరట!... అమరావతి ‘భూదందా’ కథనాలపై తదుపరి చర్యల నిలిపివేత
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక రాసిన కథనాలు ఏపీలో పెను కలకలమే రేపాయి. సదరు పత్రిక రాసిన కథనాలతో తమ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ టీడీపీ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి పత్రికతో పాటు ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ పీవీ సంజ్ కుమార్ నిన్నటి విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాక్షి పత్రిక డైరెక్టర్లపై ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సాక్షి డైరెక్టర్లు ఈశ్వరప్రసాద్ రెడ్డి, రాజప్రసాదరెడ్డి, వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళిలపై కేసులు నమోదయ్యాయి. నిన్నటి విచారణలో భాగంగా సాక్షి పత్రిక తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... డైరెక్టర్లపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.