: చేజారిన రంగుల ప్రపంచం... ముంబయ్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న సినిమా హీరోయిన్!


సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఆ రంగంలో అవకాశం లభించడం ఒక ఎత్తయితే, సక్సెస్ సొంతం చేసుకోవడం ..ఆ సక్సెస్ ను కొనసాగించడం మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. వీటన్నింటికీ కావాల్సింది ‘లక్’ అని నమ్మేవారు ఈ రంగంలో ఎక్కువగా ఉంటారు. మరీ, ఆ ‘లక్’ అందకపోతే... జీవితం ఎటుపోతుందనే దానికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ. సినిమాలంటే ఆమెకు ప్రాణం. దీంతో ముంబయికి వచ్చి సినిమాల్లో నటించాలనుకుంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. చివరకు, ఒక భోజ్ పురీ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఆమెను వరించింది. అయితే, ఆ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రం విజయం సాధించకపోవడంతో ఆమెకు హీరోయిన్ గా నటించే అవకాశాలే రాలేదు. దీంతో, కుంగిపోయిన మిథాలీ శర్మ తిరిగి ఇంటికి కూడా వెళ్లలేకపోయింది. కెరీర్ పరంగా నిలదొక్కుకోలేని తాను తన తల్లిదండ్రులకు ముఖం చూపించలేకపోయింది. వేరే పనుల వల్ల జీవనోపాధి పొందేందుకు కూడా ఆమె ఆసక్తి కనపర్చలేదు. సినిమా తప్ప తనకు వేరే పనేమి తెలియదనుకున్న మిథాలీ శర్మ జీవనం ప్రస్తుతం దుర్భరంగా మారింది. ముంబయిలోని లోకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుని బతుకుతోంది. మానసికంగా కూడా ఆమె పరిస్థితి సరిగ్గా లేదు. ముంబయిలోని ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించారు. అక్కడ మిథాలీ శర్మ గురించిన విషయాలు పోలీసులకు తెలిశాయి. హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకున్న మిథాలీ, ఆ సినిమా ఫెయిల్యూర్ కారణంగా బిచ్చగత్తెగా మారిపోయింది. రంగుల ప్రపంచంలో విహరించాల్సిన ఆమె జీవితం ఆవేదనలకు నిలయంగా మారిన వైనం ఎవరిని మాత్రం కన్నీరు పెట్టించదు?

  • Loading...

More Telugu News