: నెస్లే ఎగిరిపోతుంది... కోల్గేట్ మూతబడుతుంది...!: రాందేవ్ బాబా జోస్యం
ఏటా పదుల సంఖ్యలో నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ చిన్న కంపెనీ నుంచి వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల బడా కంపెనీ స్థాయికి చేరుకుని... హిందూస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, నెస్లే, కోల్గేట్ తదితర దిగ్గజ కంపెనీలకు దడ పుట్టిస్తున్న కంపెనీ ‘పతంజలి’. ఈ కంపెనీ అధిపతి, యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే కొన్నేళ్లలోనే పతంజలి ఉత్పత్తులు నెస్లే పక్షి (నెస్లే బ్రాండ్ లోగో) ఎగిరిపోయేలా చేస్తాయి. కోల్గేట్ కంపెనీ గేట్ ను మూతపడేలా చేస్తాయి’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. పతంజలి పేరుతో 2012లో మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేశారు రాందేవ్ బాబా. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఆయన కంపెనీ 446 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. అంచెలంచెలుగా విస్తరించుకుంటూ వెళుతూ, మార్కెట్లో ఇతర కంపెనీల వాటాను కైవసం చేసుకుంటూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 5వేల కోట్ల రూపాయల టర్నోవర్ ను దాటేసింది. తన ఉత్పత్తుల నాణ్యత, వాటిపట్ల భారతీయ ప్రజల్లో ఉన్న విశ్వాసంపై నమ్మకంతోనే రాందేవ్ బాబా పై విధంగా వ్యాఖ్యానించి ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10వేల కోట్ల రూపాయల టర్నోవర్ తమ కంపెనీ అమ్మకాల లక్ష్యంగా బాబా చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదువేల పంపిణీదారులు, 10వేల పతంజలి స్టోర్స్, 100 మెగాస్టోర్స్ కంపెనీ ఉత్పత్తులను మరింత ముందుకు తీసుకెళతాయన్నారు. రైతులకు సాయం అందించడమే కాకుండా అదనంగా లక్ష ఉద్యోగాలను తాము సృష్టించామని చెప్పారు. రైతుల నుంచి నేరుగా వెయ్యి టన్నుల మేర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తమ కంపెనీ ఉత్పత్తుల ప్రకటనల్లో అసభ్యత, అందాల ఆరబోత, తప్పుడు హామీలు ఉండవని స్పష్టం చేశారు.