: క్యాబ్ ఎక్కేందుకు జేబు తడుముకున్న క్రికెట్ రారాజు సచిన్... గత స్మృతులు!
అత్యంత సంపన్న క్రీడాకారుల్లో సచిన్ కూడా ఒకరన్న విషయం జగద్వితం. ఇదంతా సక్సెస్ తర్వాత వచ్చిన సంపద. కానీ క్రికెట్ తొలినాళ్లలో ఓ రోజు రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కడానికి చాలినన్ని డబ్బులు లేక తాను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని సచిన్ తాజాగా బయటపెడ్డాడు. ముంబైలో డీబీఎస్ బ్యాంక్ డిజీబ్యాంక్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా సచిన్ తన మనసులోని పలు విషయాలను అందరితో పంచుకున్నాడు. "12 ఏళ్ల వయసులో ముంబై అండర్ 15 జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. జేబులో కొంత నగదుతో పూనెలో మూడు మ్యాచులు ఆడేందుకు వెళ్లాను. కానీ మ్యాచు జరిగే రోజు వర్షం మొదలైంది. నాలుగో ఆటగాడిగా క్రీజులో దిగే అవకాశం లభించింది. కానీ రనవుట్ కావడంతో ఎంతో నిరాశతో డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ తర్వాత ఆ ట్రిప్ లో బ్యాట్ పట్టేందుకు మరో అవకాశం రాలేదు. వర్షం పడుతుంటే ఆ రోజున బయటకు వెళ్లి సినిమా చూసి కడుపునిండా తిని వచ్చాము. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియనప్పుడు ఎలా దాచుకోగలను? దాంతో జేబులో ఉన్నదంతా ఖర్చయిపోయింది. ముంబైకి రైలులో తిరిగి చేరుకున్న తర్వాత జేబులో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో చేతిలో ఉన్న రెండు పెద్ద బ్యాగులను దాదర్ స్టేషన్ వద్ద వదిలిపెట్టి శివాజీ పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్లాను" అని సచిన్ వివరించాడు. సెల్ ఫోన్ శకం రాకముందునాటి పరిస్థితిని తెలియజేస్తూ... "ఒకవేళ ఆ రోజు నా చేతిలో సెల్ ఫోన్ ఉండి ఉంటే... ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే నాన్నో, అమ్మో డబ్బులు నా ఫోన్ కు పంపించేవారు. దాంతో క్యాబ్ లో ఇంటికి వెళ్లేవాడినే కదా" అని సచిన్ స్మార్ట్ ఫోన్ వల్ల నేడు ఎన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నామో గుర్తు చేశాడు. అంతేకాదు, తాను క్రికెట్ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ ఆటపరంగా వచ్చిన మార్పులను కూడా సచిన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించిన తొలి ఆటగాడిని చరిత్రలో తానేనన్నాడు. 1992లో డర్బన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా సచిన్ ను 11 పరుగుల వద్ద రనౌట్ అయినట్టు రీప్లేను గమనించిన థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ మనకు అనుకూలంగా కూడా ఉండదని సచిన్ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.