: సంతకం చేసే ముందు ఫైల్ లో తప్పులు చూపిన చంద్రబాబు... చేతిరాతతో సరిచేసిన అధికారులు
వయసు మీద పడుతున్నా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిలో పాలనా సామర్థ్యం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా... మరింతగా ఇనుమడిస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఘటననే చెప్పుకోవచ్చు. నిన్న తెల్లవారుజామునే వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 4.01 గంటలకు ముందే అక్కడికి వెళ్లిన చంద్రబాబు ఉదయం 9 గంటల దాకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ‘ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్’గా నామకరణం చేసిన తాత్కాలిక సచివాలయంలో తాను ప్రారంభోత్సవం చేసిన గదిలో చంద్రబాబు కూర్చున్నారు. సచివాలయం ప్రారంభించిన సందర్భంగా లాంఛనంగా రుణమాఫీకి సంబంధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు రూపొందించిన సదరు ఫైలును చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన రెండు పొరపాట్లను ఎత్తిచూపారు. వాటిని సరిచేసిన తర్వాతే సంతకం పెడతానని చెప్పారు. అయితే అక్కడ కంప్యూటర్లు గాని, ప్రింటర్ గాని లేవు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు చేతి రాతతోనే సదరు తప్పులను సరిదిద్దారు. ఆ తర్వాత మరోమారు ఫైల్ ను ఆసాంతం పరిశీలించిన చంద్రబాబు మరో తప్పును కూడా ఎత్తిచూపారు. దానిని కూడా అధికారులు చేతిరాతతోనే సరిచేశారు. ఆ తర్వాత మరోమారు ఫైల్ ను పరిశీలించిన చంద్రబాబు అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే సంతకం చేశారు. 66 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు చిన్న చిన్న పొరపాట్లను కూడా ఎత్తి చూపిన వైనం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.