: సుప్రీం సీజే కంటతడిపెట్టిన వేదిక మీద నవ్వులు పూయించిన మోదీ


న్యాయవ్యవస్థపై పడుతున్న పని భారాన్ని గుర్తు చేసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. పనిభారం పెరుగుతున్న వైనంపై న్యాయమూర్తులు తనను చుట్టుముట్టిన వైనాన్ని ప్రస్తావించిన భారత ప్రధాని నవ్వులు పూయించారు. ఈ రెండు ఘటనలకు వేదికగా నిలిచింది ఒక్కటే వేదిక. అదే నిన్న ఢిల్లీలో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు. న్యాయమూర్తులు తక్కువగా ఉండడంతో, జ్యూడీషియరీపై పడుతున్న పనిభారాన్ని ప్రస్తావిస్తూ కలత చెందిన జస్టిస్ ఠాకూర్ కంటతడిపెట్టిన వైనం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆలోచనలోనూ పడేసింది. ఈ క్రమంలో అక్కడ గంభీరమైన వాతావరణం చోటుచేసుకుంది. ఇక ఆ తర్వాత ప్రసంగించేందుకు లేచిన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ గంభీర వాతారణాన్ని కాస్తంత చల్లబరిచేందుకు చేసిన యత్నం అందరినీ నవ్వుల్లో ముంచేసింది. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో తాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సుకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడినని మోదీ చెప్పారు. ఆ సమయంలో కోర్టుల్లో కొండగా మారుతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి తానో సూచన చేశానని ఆయన పేర్కొన్నారు. కోర్టుల పనిగంటలు పెంచితే సమస్య పరిష్కారమైనట్టేగా? అని ఓ సదస్సులో తాను సూచించగా, సదస్సు ముగిసిన వెంటనే న్యాయమూర్తులంతా తన వద్దకు వచ్చి మెడ పట్టుకున్నంత పనిచేశారని మోదీ చమత్కరించారు. ‘‘ఇప్పటికే పనిభారం పెరిగి సతమతమవుతుంటే.. పనిగంటలు పెంచమని సూచిస్తావా?’’ అంటూ జడ్జీలంతా కస్సుమన్నారంటూ మోదీ చెప్పేసరికి నిన్నటి సదస్సులో అందరూ సరదాగా నవ్వేశారు.

  • Loading...

More Telugu News