: అతిథులూ! ఈ పధ్ధతి సరికాదు, మంచినీళ్లు వేస్ట్ చేయకండి!: ఆవేదన వ్యక్తం చేసిన బాలసుబ్రహ్మణ్యం
గత రెండు రోజుల్లో పలు శుభకార్యాలకు హాజరైన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ సందర్భంగా తను చూసిన పరిస్థితులపై తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తాను హైదరాబాదులో ఉన్నానని, ఈ సందర్భంగా వివిధ కుటుంబ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. అయితే తాను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో మినరల్ వాటర్ బాటిల్స్ సరఫరా చేశారని ఆయన తెలిపారు. అయితే ఈ మినరల్ వాటర్ బాటిళ్లలో కొంత నీటిని తాగిన తరువాత, ఆ బాటిళ్లను టేబుల్స్ కింద పెడుతున్నారని, ఇలా నీరు మిగిలిపోయిన మినరల్ వాటర్ బాటిల్స్ ని శుభ్రం చేసేవాళ్లు తీసుకెళ్లి, వాటిల్లోని నీటిని సింక్ లో ఒలకబోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము తాగిన వాటర్ బాటిల్స్ ను అలా వదిలేసే బదులు, అతిథులే వాటిని తమ వెంట తీసుకువెళ్లి ఆ నీళ్లను వాడుకోవాలని, లేదా కార్యక్రమ నిర్వాహకులు వాటిని సేకరించి, వాటిల్లోని నీటిని మరో మంచి పనికి ఉపయోగించాలని ఈ సందర్భంగా బాలు సలహా ఇచ్చారు. దేశంలోని పలు ప్రాంతాలు తాగునీటికి కటకటలాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అతిథులు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆయన హితవు పలికారు.