: భారతీయ ఉద్యోగిని అనుకరించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉద్యోగిని అనుకరిస్తూ అమెరికా సేవల విభాగాన్ని ఎద్దేవా చేశారు. డెలవారేలో మద్దతుదారులతో ఆయన మాట్లాడుతూ, తన క్రెడిట్ కార్డ్ కు చెందిన కస్టమర్ సర్వీస్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవాలని భావించి కాల్ సెంటర్ కు ఫోన్ చేశానని ఆయన చెప్పారు. తన క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన సమచారం చెక్ చేసుకుంటున్నానని, ఇంతకీ కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? అని అడిగితే అవతలి వ్యక్తి 'ఇండియా' అని అన్నాడని భారతీయ యాసలో ఆయన చెప్పారు. ఇది ఎంత దౌర్భాగ్యం? మాన్యూఫాక్చరింగ్ జాబ్స్ దోచుకుంటున్నారు. అమెరికన్స్ ఉద్యోగాలు దోచుకుంటున్నారు. ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. ఇలా ఎంత మాత్రమూ జరగనివ్వకూడదని ఆయన చెప్పారు. తనకు ఏ దేశంపైనా ద్వేషం లేదని చెప్పిన ఆయన చైనా, జపాన్, మెక్సికో, వియత్నాం, ఇండియాలు మన దేశంలోకి చొచ్చుకొచ్చేలా మన విధానాలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. చంటిపిల్లాడి నుంచి చాక్లెట్లు లాగేసుకునేలా అమెరికా నుంచి వ్యాపారాన్ని ఇతర దేశాలు కొల్లగొట్టేలా విధానాలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. డెలావరేలో తనకు 378 రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశం గొప్పదేశమని చెప్పిన ఆయన, ఆ దేశ నేతలను చూసి తనకు ఆందోళన కలగడం లేదని, అయితే అమెరికా నేతలను చూసి బాధకలుగుతోందని ఆయన అన్నారు.