: హజి అలీ దర్గాలోకి ప్రవేశిస్తే తృప్తి దేశాయిని చెప్పుతో కొడతాం: శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్
లింగభేదాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాల్లో మహిళల ప్రవేశాన్ని డిమాండ్ చేస్తూ భూమాతా బ్రిగేడ్ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న విషయం తెలిసిందే. ఉద్యమ ఫలితంగా ఇప్పటికే దేశంలో మహిళలకు నిషేధం ఉన్న పలు దేవాలయాల్లోకి మహిళలు ప్రవేశించిన క్రమంలోనే భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ముంబైలోని ప్రసిద్ధ హజీ అలి దర్గాలోనికి ప్రవేశిస్తామని తెలిపారు. ఈనెల 28న ఆ దర్గాలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే హజి అలి దర్గాలో మహిళల ప్రవేశం కోసం ఉద్యమిస్తామని భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ చేసిన ప్రకటనపై శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తృప్తీ దేశాయ్ హజీ అలి దర్గాలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే చెప్పులతో కొడతామని ఆయన హెచ్చరించారు. ఇటీవలే మహిళల ప్రవేశం దృష్ట్యా పలు దేవాలయాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.