: భారత మార్కెట్లోకి ‘బెంట్లే’ కారు!... ఖరీదు రూ.3.85 కోట్లు
భారత రోడ్లపై లగ్జరీ కార్ల రాజసం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని లగ్జరీ కార్ల కంపెనీలకు చెందిన కార్లన్నీ దాదాపుగా వచ్చేశాయి. ఇక ఇప్పుడు అల్ట్రా లగ్జరీ కార్ల వంతు వచ్చేసింది. ప్రపంచంలోనే అల్ట్రా లగ్జరీ కార్ల కంపెనీల్లో పేరెన్నికగన్న ‘బెంట్లే’ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ విభాగంలో తాజా మోడల్ ‘బెంటేగా’ను ఆ సంస్థ నిన్న భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగం అందుకునే బెంటేగా ధర చూస్తే మాత్రం కళ్లు తిరగక మానవు. ఈ కారు ధరను రూ.3.85 కోట్లుగా నిర్ణయించినట్లు ఆ కంపెనీకి డీలర్ గా ఉన్న ‘ఎక్స్ క్లూజివ్ మోటార్స్’ ఎండీ సత్య బగ్లా చెప్పారు. ఎంట్రీ ఇవ్వకముందే.. ఈ కారుపై భారతీయులు అమితాసక్తి కనబరుస్తున్నారని, ఇప్పటికే మూడంకెలకు పైగా అడ్వాన్స్ డ్ బుకింగ్ లు వచ్చాయని ఆయన చెప్పారు. ఇక ఈ అల్ట్రా లగ్జరీ కారుకు చెందిన షోరూమ్ ను మరో రెండు నెలల్లో హైదరాబాదులోనూ తెరవనున్నట్లు ఆయన చెప్పారు.