: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కొత్త మలుపు... హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే!
ఉత్తరాఖండ్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఉత్తరాఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్ పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన హైకోర్టు, రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యాన్ని ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన తొందరపాటు చర్యగా అభివర్ణించింది. కొన్నిసార్లు రాష్ట్రపతి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతూ, రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ బుధవారం జరుగుతుందని తెలిపింది. ఈ నెల 27 వరకు యథాతథ స్థితి కొనసాగుంతుందని సుప్రీంకోర్టు తెలిపింది.