: శింబు! మీ నాన్నతో చర్చించాం...తొందరపడొద్దు: విశాల్
తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎలాంటి ధైర్యం చెప్పలేదని, అలాగే ఈ మధ్య చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు నిర్వహించిన సినీ నటుల క్రికెట్ మ్యాచ్ కు కూడా తనకు ఆహ్వానం పంపనందుకు నిరసన వ్యక్తం చేస్తూ కోలీవుడ్ నటుడు శింబు నడిగర సంఘం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీనిపై సంస్థ ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ స్పందించాడు. శింబును తొదరపడవద్దని సూచించాడు. బీప్ సాంగ్ వివాదంలో శింబు చిక్కుకున్నప్పుడు అతనితోనూ, అతని తండ్రి టి.రాజేందర్ తోనూ తాను, నాజర్, కార్తీ చర్చించామని విశాల్ తెలిపాడు. అయితే సమస్యను చట్టరీత్యా ఎదుర్కొంటామని రాజేందర్ సూచించడంతో తాము తలదూర్చలేదని విశాల్ చెప్పాడు. శింబు ప్రకటనపై ఈ నెల 24న నడిగర సంఘం కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విశాల్ వెల్లడించాడు. శింబు ప్రకటన గురించి మీడియా ద్వారానే తమకు తెలిసిందని, దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని విశాల్ తెలిపాడు.