: కారొదిలి రైలెక్కిన సురేష్ ప్రభు... పెళ్లికి పిలిచిన ప్రయాణికుడు!
ముంబైలోని కుర్రే రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేసేందుకు బయలుదేరిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కాన్వాయ్ ని వదిలి రైలెక్కారు. రోడ్డుపై వెళితే, మరింత ఆలస్యమవుతుందని భావించిన ఆయన ఛత్రపతి శివాజీ టర్మినస్ కు వెళ్లేందుకు లోకల్ రైలెక్కేశారు. తమ పక్కన స్వయంగా రైల్వే మంత్రి కనిపించడంతో, ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. రైల్లో ప్రయాణిస్తున్న వారితో మాటకలిపిన సురేష్ ప్రభు, వారికి మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో సలహాలు, సూచనలు కోరారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను దిగాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేవరకూ, ఆయన నిలబడే ఉన్నారని, కూర్చోవాలని సీట్ ఆఫర్ చేసినా సున్నితంగా నిరాకరించారని ప్రయాణికులు తెలిపారు. ఓ వ్యక్తి తన ఇంట్లో వివాహముందని చెబుతూ, వేడుకకు రావాలని ఆహ్వానపత్రం అందించగా, దాన్ని చిరునవ్వుతో స్వీకరించారు. కాగా, సురేష్ ప్రభు లోకల్ రైలులో ప్రయాణించడం ఇది రెండసారి.