: శాంతి చర్చలకు చొరవ తీసుకుంటే, తల నరికి వేసిన వ్యక్తి ఫొటో పంపారు: శ్రీశ్రీ రవిశంకర్
ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఐఎస్ఐఎస్ ఉగ్ర వాదులు చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చిన భారత ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యలను అవమానిస్తూ ఆ ఉగ్రమూక.. తల నరికి వేసిన ఓ వ్యక్తి శరీరం ఫొటోను ఆయనకు పంపించింది. ఈ విషయాన్ని శ్రీశ్రీ రవిశంకర్ అగర్తలాలో మీడియాకు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ శాంతిని ఏమాత్రం కోరుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. 'ఐఎస్ఐఎస్‌తో శాంతి చర్చలకు చొరవ తీసుకున్నా'నని, 'దానికి ఆ సంస్థ స్పందిస్తూ ఈ చర్యకు పాల్పడింద'ని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదులతో శాంతి దిశగా చర్చల ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఐఎస్ఐఎస్‌కు వ్యతిరేకంగా మిలిటరీ పోరాడాల్సిందేనని రవిశంకర్ అన్నారు.