: నాకు అత్యంత ప్రీతిపాత్రులు బాలకృష్ణ... 100వ చిత్రం 200 రోజులు ఖాయం: కేసీఆర్


బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. వేదికపై ఉన్న పలువురు ప్రముఖులను పేరుపేరునా పలకరించిన ఆయన మాట్లాడుతూ, "నాకు అత్యంత ప్రీతిపాత్రులు, నటరత్న, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ..." అనగానే ఆడిటోరియం ఈలలు, కేకలు చప్పట్లతో దద్దరిల్లింది. "గౌతమీపుత్ర శాతకర్ణి... ఇదేమీ చిన్న విషయం కాదు. ఒక శకానికి నాంది పలికినటువంటి పురుషుడు గౌతమీపుత్ర శాతకర్ణి. అంతకుముందు మన తెలుగుజాతికి తెలిసినదంతా కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే పధ్ధతిలో ఉన్నాము. కానీ, 100వ చిత్రానికి బాలకృష్ణ గారు, తెలుగు చరిత్రలో ప్రజలందరికీ, చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఈ శాతకర్ణి... శాతవాహన శకానికి సంబంధించిన కథా వస్తువు తీసుకుని నూరవ చిత్రాన్ని నిర్మించ తలపెట్టడం చాలా సంతోషం. నేను వయసులో బాలకృష్ణ కన్నా కొంచెం పెద్దకాబట్టి, అన్నగారి అభిమానిగా, హృదయపూర్వకంగా నా ఆశీస్సులు, నా దీవెనలు. బాలకృష్ణ 100వ చిత్రం 200 రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను. అన్ని తరాల తెలుగు ప్రజలందరూ చూసి, తెలుసుకోవలసిన కథాంశం ఈ గౌతమీపుత్ర శాతకర్ణి" అని అన్నారు.

  • Loading...

More Telugu News