: సల్మాన్ ఖాన్ కు భారీ భద్రత... 1000 మంది పోలీసులతో భద్రత
ఉత్తరప్రదేశ్ లో షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు 1000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సల్మాన్ కు భారీ భద్రత కల్పించారు. ప్రస్తుతం ‘సుల్తాన్’ షూటింగ్ యూపీలో జరుగుతోంది. సినిమా సెట్స్ లో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గాను ముందస్తు భద్రతాచర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముజఫర్ నగర్ లోని ఒక ఫాంహౌస్ లో సల్మాన్ బస చేస్తున్నాడు. ఆ ప్రాంతంలోని రోడ్లపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. సల్మాన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట భద్రతా బలగాలకు చెందిన 20 మంది మంది సిబ్బంది ఉండేలా యూపీ సర్కార్ చర్యలు తీసుకుంది. దీంతో పాటు సల్మాన్ తో ఫొటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చే అభిమానులను అనుమతించవద్దని సీఎం అఖిలేష్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, సల్మాన్ ఖాన్ ముజఫర్ నగర్ లో బస చేశారన్న వార్త తెలియడంతో అభిమానులు అధిక సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు.