: వివరణ ఇవ్వడానికి నేను సిద్ధం, పథకం ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తున్నారు: రోజా
వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై రాద్ధాంతం వద్దని, సమస్యను పాజిటివ్‌గా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో.. ఈరోజు న్యూఢిల్లీలో రోజా స్పందించారు. 'అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా'నని రోజా తెలిపారు. చెడు ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలని హితవు పలికారు. మహిళల కోసం పోరాడుతున్నందుకే తనను సస్పెండ్ చేశారని రోజా అన్నారు. మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా మార్షల్స్ సాయంతో అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని, ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యానని పేర్కొన్నారు. పథకం ప్రకారం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇప్పటికైనా అందరూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు ప్రతిపక్షాలకి ఎక్కువ సమయం ఇవ్వాలని సూచించారు.