: రోజాను రాజకీయంగా టార్గెట్ చేశారు: సుప్రీంలో ఇందిరా జైసింగ్
వైకాపా ఎమ్మెల్యే రోజాను తెలుగుదేశం పార్టీ రాజకీయంగా టార్గెట్ చేసిందని, ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టులో వాదించారు. ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయమై కొద్దిసేపటి క్రితం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. తన క్లయింటు సస్పెన్షన్ విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని ఆమె కోర్టుకు తెలిపారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినట్టు కనిపిస్తోందని ఆమె అన్నారు. ఏడాది పాటు సస్పెండ్ చేయడం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వంటిదేనని అన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తాము హైకోర్టును ఆశ్రయిస్తే, అక్కడ న్యాయం జరగలేదని గుర్తు చేశారు. హైకోర్టులో తీర్పు కాపీని అందించడంలో కూడా తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే కోర్టు కల్పించుకోవాలని కోరారు. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి.