: ఇంత జరిగింది... ఆమెతో ఇక కలవలేము: వేధింపులకు గురైన బాలికపై కాశ్మీర్ విద్యార్థినులు
జమ్మూకాశ్మీర్ లోని హింద్వారాలో నేడు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని ఈ పట్టణంలో గత వారం రోజులుగా తీవ్ర హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న 16 ఏళ్ల బాలికపై ఓ సైనికుడు వేధింపులకు పాల్పడ్డాడన్న వార్తలు రాగా, ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. ఆపై పోలీసుల కాల్పుల్లో ముగ్గురి మృతి, కర్ఫ్యూ, కొనసాగిన ఆందోళనల అనంతరం, తనను వేధించింది స్థానికులేనని, సైనికుడు కాదని ఆ బాలిక చేత చెప్పించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక నేడు స్కూళ్లు ప్రారంభంకాగా, ఆ బాలిక పాఠశాలకు రాలేదు. ఆమె స్నేహితులు సైతం, ఆ అమ్మాయి వస్తే, ఇంతకు ముందు కలిసున్నట్టుగా కలిసుండలేమని అంటున్నారు. ఇంత జరిగిన తరువాత స్కూలుకు రాకపోవడమే మేలని సలహాలు ఇస్తున్నారు. తమ స్నేహితురాలు నిజం ఇంకా చెప్పలేదని భావిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బాలికను, ఆమె తండ్రి, ఆంటీ సహా అందర్నీ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు పోలీసులు బలవంతపెట్టి ఆమెచేత అనుకూల స్టేట్ మెంట్ ఇప్పించుకున్నారని ఈ ప్రాంతంలోని అత్యధికులు నమ్ముతుండటం గమనార్హం.