: ద్రవిడ్ సానబడితే...కొహ్లీ రాటుదేలుస్తున్నాడు: సర్ఫరాజ్ ఖాన్
అండర్ 19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను సానబెడితే...ఐపీఎల్ లో కోహ్లీ తనను రాటుదేలుస్తున్నాడని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. భవిష్యత్ ఆశాకిరణంగా సీనియర్లు పేర్కొంటున్న సర్ఫరాజ్ మాట్లాడుతూ, అనుభవం కలిగిన ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం తనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్ వంటి అనుభవజ్ఞులతో ఆడుతుంటే ఎంతో విలువైన విషయాలు తెలుస్తున్నాయని పేర్కొన్నాడు. సందర్భానికి తగ్గట్టు స్వేచ్ఛగా ఆడాలని కోహ్లీ చెబుతుంటాడని సర్ఫరాజ్ తెలిపాడు. ప్రతి మ్యాచ్ తొలి మ్యాచ్ అని క్రీజులోకి దిగాలని వారు సూచిస్తారని తెలిపాడు. గతేడాది ఐపీఎల్ లో ఎన్నో తప్పులు చేశానని, ఈ ఏడాది ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటున్నానని చెప్పాడు. సీనియర్లంతా తనను ప్రోత్సహిస్తున్నారని చెప్పిన సర్ఫరాజ్, కోహ్లీ, డివిలియర్స్ మంచి ఫాంలో ఉండడంతో తన వరకు బ్యాటింగ్ వచ్చే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు.