: మోదీ వచ్చి త్రివర్ణపతాకం ఎగరేస్తేనే...: శ్రీనగర్ నిట్ విద్యార్థుల డిమాండ్
శ్రీనగర్ లోని ఎన్ఐటీని మరో ప్రాంతానికి తరలించేందుకు వీలుపడదని కేంద్రం స్పష్టం చేసిన వేళ, కనీసం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి వర్శిటీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తమలో ధైర్యం నింపాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి వీలు పడని పక్షంలో కనీసం విద్యా శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని వారు కోరారు. ఈ మేరకు వారు ఓ లేఖను రాస్తూ, 19 డిమాండ్లను కేంద్రం ముందుంచారు. సీఆర్పీఎఫ్ దళాలను శాశ్వతంగా మోహరించాలని, కాలేజీ అధికారులను మార్చాలని, స్టూడెంట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, జాతీయ పండగలను జరిపేందుకు అనుమతించాలని, పరీక్షా పత్రాలను బయటి రాష్ట్రాల్లో దిద్దించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే, వర్శిటీలో ధైర్యంగా ఉండగలుగుతామని, లేకుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో నన్న భయాలు వెంటాడుతూనే ఉంటాయని తెలిపారు.