: 8 నెలల్లో 100 కోట్ల మార్కెట్ ను తాకిన పల్స్ క్యాండీ... మ్యాంగో బైట్, ఆల్ఫెన్ లీబేలకు తీవ్రమైన పోటీ!


'పాస్ పాస్ పల్స్ కచ్చా ఆమ్' పేరిట పచ్చి మామిడికాయ రుచితో సరిగ్గా 8 నెలల క్రితం భారత హెచ్బీసీ (హార్డ్ బాయిల్డ్ క్యాండీస్) మార్కెట్లోకి వచ్చిన క్యాండీ, ప్రస్తుతం రూ. 100 కోట్ల టర్నోవర్ క్లబ్ లోకి చేరింది. క్యాండీ విభాగంలో రాజ్యమేలుతున్న మ్యాంగో బైట్, ఆల్ఫెన్ లీబేలకు విపరీతమైన పోటీని ఇస్తోంది. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) పరిశ్రమ వృద్ధితో పోలిస్తే ఒకటిన్నర రెట్లు అధిక వృద్ధితో దూసుకెళుతున్న క్యాండీ మార్కెట్, కొత్త కొత్త సంస్థలను సైతం ఆకర్షిస్తోంది. గతంలో కోక-కోలా నుంచి డైట్ డ్రింక్ కోక్ జీరో విడుదలైనప్పుడు ఎనిమిది నెలల్లో సాధించిన రూ. 100 కోట్ల రికార్డును ఎనిమిది నెలల క్రితం ధరమ్ పాల్ సత్యపాల్ (డీఎస్) గ్రూప్ విడుదల చేసిన పల్స్ క్యాండీ సమం చేయడం గమనార్హం. గత సంవత్సరం ఎక్లైర్స్ వంటి సాఫ్ట్ టాఫీలు 10 శాతం కన్నా తక్కువ వృద్ధిలో అమ్మకాలు పెంచుకోగా, గట్టిగా ఉండే క్యాండీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని రీసెర్చ్ సంస్థ నీల్సన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఉదాసి వ్యాఖ్యానించారు. స్వీట్ క్యాండీ మార్కెట్ 14 శాతం వృద్ధితో సాగుతుండగా, హెచ్బీసీ సెగ్మెంట్ 24 శాతం వృద్ధితో రూ. 2,100 కోట్లకు చేరిందని తెలిపారు. కాగా, రజనీగంధా పాన్ మసాలా తయారీదారుగా ఉన్న డీఎస్ గ్రూప్, వివిధ రాష్ట్రాలు పాన్ మసాలా అమ్మకాలపై నిషేధాలు విధించడం, అమ్మకాలు తగ్గడం తదితర కారణాలతో క్యాండీ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వచ్చింది. పచ్చి మామిడి కాయ ఫ్లేవర్, దానికి కొంత ఉప్పు రుచిని జోడించి వినూత్నంగా 'పల్స్' క్యాండీని విడుదల చేసి విజయం సాధించింది.

  • Loading...

More Telugu News