: ఇద్దరు చంద్రులు బాగా పని చేస్తున్నారు: తెలుగు రాష్ట్రాల సీఎంలపై గవర్నర్ కామెంట్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు (ఏపీ), కల్వకుంట్ల చంద్రశేఖరరావు(తెలంగాణ)ల పనితీరుపై రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం నరసింహన్ అక్కడి మీడియాతో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకతేమీ లేదని పేర్కొన్న గవర్నర్... రోటీన్ గానే పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం న్యాయమూర్తులను కలిశానని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల మాటేంటన్న మీడియా ప్రశ్నకు ఆయన వేగంగా స్పందించారు. ఇద్దరు సీఎంలు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన గవర్నర్... రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. చిన్న చిన్న సమస్యలు మామూలేనన్న గవర్నర్... వాటి పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు తరచూ చర్చించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.