: కాబూల్ లో పేలిన కారు బాంబు!...24 మంది దుర్మరణం, భీకర కాల్పులతో దద్దరిల్లుతున్న అఫ్ఘన్ రాజధాని
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని నాటో బలగాల ప్రధాన కార్యాలయం, అమెరికా రాయబార కార్యాలయం, అఫ్ఘన్ భద్రతా బలగాలకు చెందిన ప్రధాన కేంద్రాలకు అత్యంత సమీపంలో సంభవించిన ఈ పేలుడులో 24 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఓ కారులో ఉంచిన శక్తిమంతమైన బాంబులు పేలిన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక సమాచారం. అఫ్ఘన్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. వెనువెంటనే స్పందించిన అఫ్ఘన్ పోలీసులు రంగంలోకి దిగారు. తమ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. దీంతో అక్కడి ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది.